Tuesday, 17 August 2010

'అభివృద్ధి' ఉన్మాదులు

'అభివృద్ధి' ఉన్మాదులు

ఆ రోజు జూలై 14 దోస్తుల్తో సెలవుల మీద అమెరికా లోని కాలిఫోర్నియా లో ఉన్నా. పొద్దున్న లేవంగనే కొద్ది సేపు మన వార్తలు చదువుదామని ఆన్ లైన్ లో పేపర్ చూశ్న. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని పచ్చని పొలాల్లో ఎర్ర మల్లెలు నేల రాలాయి, రాజ్య హింస తూటాలకు మరి కొంత మంది బలి అయ్యిన్రు. అన్ని పేపర్లలో, న్యూస్ చానల్స్ లో అమాయకులు చనిపోయారు అని హెడ్ లైన్స్ రాసిన్రు, కానీ నా దృష్టిలో వాళ్ళను అమాయకులు అంటే వాళ్ళ త్యాగాలను ధైర్యాన్ని అవమానపర్చినట్లే. అమాయకులు కాదు కాబట్టే ఖాకీల బూట్ల చప్పుళ్ళకు ఏ మాత్రం జంకకుండా, పెత్తందార్ల గడీలు కూల్చనీకి ఉత్త చేతులతో చీమలదండులాగా బయలుదేరి, ఆయుధాలు పట్టిన పోలీసులనే తరిమిన మండే నిప్పు కణాలు, త్యాగాల బిడ్డలు, మరణమంటే త్రున ప్రాయమనే విప్లవాల వీర శహీదులు. మన ''ప్రజాస్వామ్యిక దేశంలో'' ఇలాంటి ఎర్ర మల్లెలు ఎన్నో నేల రాలాయి, ఇలాంటి పూలని రాజ్యం ఎంత కోసే కొద్ది అంతకంత పూస్తనె ఉన్నయ్, తుది మొదలు తేడ లేకుండా ఈ మల్లెల తీగలు చిదిమేకొద్ది ఎదుగుతూనే ఉన్నాయ్.

ఏమని చెప్పాలి, ఎక్కడని చెప్పాలి..ఒక ప్రాంతం లేదు..ఒక రాష్ట్రం లేదు..ఒక భాష అంటూ భేదం లేదు..బలహీనుల్ని దోచుకోటంలో మాత్రం మన దేశంలో బలవంతుల మద్య సమైక్యత బాగా కనపడతది. ఒక సింగూర్, పోలేపల్లి, నందిగ్రామ్, బయ్యారం, నానక్ రాం గూడ, దంతేవాడ, చిలమత్తూర్....నేడు సోంపేట...రేపు మహబూబ్ నగర్ లోని హిందూపూర్ కావొచ్చు..ఇలా రాసుకుంటే పోతే రామాయణం, వింటూ పోతే మహాభారతం అంత పెద్దగా అనిపిస్తది మనకి... పల్లెల పేర్లే మారుతాయి ఒక దగ్గర గని అయితే మరోదిక్కు ప్రత్యేక ఆర్ధిక మండలి (SEZ) ఇంకో దగ్గర థర్మల్ విద్యుత్ కేంద్రం... అన్నీ 'అభివృద్ధి' పేరు మీద సామాన్య ప్రజల పై జరుగుతున్న ఉన్మాద చర్యలే. ఒక్కో సారి వినటానికి ఎంత చిత్రంగా ఉంటుంది అంటే...అత్యంత వెనుకపడ్డ జిల్లాగా పేర్కొనబడే శ్రీకాకుళం 'అభివృద్ధి' లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు సిద్దం అవుతుంది.. మరి మనందరికీ 20 కి పైగా తెలుగు న్యూస్ చానెల్స్ ఉండి కుడా ఈ విషయం తెలియకపోవటం ఏందా అని అనుకుంటున్రా ? ఈ విషయం లో సోంపేట రైతులు మాత్రం మస్తుగా స్పందించిన్రు, పోలీసులతో సమానంగా మన మీడియా మిత్రులను కూడా ఉరికిన్చుకుంటూ చెప్పులతో దేహ శుద్ధి చేసిన్రు.. ఇక మన గిన్నిస్ బుక్ రికార్డ్ విషయాల్లోకి వెళ్తే, బహుశా ప్రపంచం లో ఎక్కడా లేని విద్యుత్ ప్లాంట్లు శ్రీకాకుళం లో ఉన్నాయ్:

రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం,
ఎచ్చెర్ల దగ్గర వరం పవర్ ప్రోజెక్ట్
సంతబొమ్మాళి మండలంలో ఈస్టుకోస్టు ఎనర్జీ
సూర్యచక్ర థర్మల్‌ ఎనర్జీ
మేఘవరం ఎనర్జీ
సోంపేట మండలంలోని బీల భూముల వద్ద నాగార్జున ఎనర్జీ
రణస్థలం మండలంలో ఆశ్రిత ఎనర్జీ
కంచిలి మండలంలో నమ్రత ఎనర్జీ సంస్థ
కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రం

శ్రీకాకుళం జిల్లాలో ఇంత “అభివృద్ధి” జరుపుతున్నామని మన ప్రభుత్వం అనగానే, ఈ పెట్టుబడిదార్లకు మన మీడియా వంత పాడటం, దానికి మన మధ్య, ఎగువ తరగుతుల యువకులం “భలే భలే” అంటూ ఏ మాత్రం సామాన్య ప్రజల అవసరాన్ని గుర్తించకుండా ఇటువంటి అర్ద రహిత అభివృద్ధి నమూనాలను నమ్ముతున్నాం (అయినా మనకు కావాల్సింది ఇండియన్ ఐడల్ లో మనం SMS పంపినోడు గెలిచిండా లేదా.. డీ, ఆట ల్లో ఏ పోరి స్టెప్పులు బాగా ఏస్తుంది లాంటి విషయాలు అంటారా ?). మన  కళ్ళన్నీ ఇలా పల్లకి ఎక్కే క్షణాల కోసం మాత్రమే చూస్తు, బలయ్యే సామాన్యుల కష్టాలు “అనాగరికంగా”, వాళ్ళ పోరాటాలు “నక్సలిజంగా” చాలా కన్వీనియంట్గా పేర్లు పెట్టి, ఈ దారుణాల్ని మహదర్జాగా ఎంజాయ్ చేస్తే, రేపు 'అభివృద్ధి' పేరు మీద మన ఇంటిని కుడా కబలిస్తారు.

ఈ విద్యుత్ కేంద్రాలకు, గనుల పరిశ్రమలకు, చౌకగా బాగా ఎక్కువ విస్తీర్ణపు భూములు, అధిక మొత్తంలో నీరు కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వల్ల జరిగే ప్రత్యక్ష, పరోక్ష నష్టాలు తెలిసి ఉద్యమించని అమాయక ప్రజలు కావాలి. సోంపేట మండలంలో ఇప్పుడు నాగార్జున కంపెని వారు థర్మల్ పవర్ ప్లాంటు పెట్టడానికి ప్రయత్నిస్తున్న స్థలంలో ఒక పెద్ద నీటి మడుగు ఉంది. దీన్ని స్థానికులు “బీల” అంటారు. వందల ఎకరాల్లో విస్తరించిన ఈ బీల  చుట్టుపక్కల రైతులకు, మత్స్యకారులకు ప్రధాన జీవనాధారం. అయితే మన ప్రభుత్వ పెద్దలకు ఈ బీల “పనికిరాని భూమి” కింద కనపడింది. ఇంకేం మన పాలకులు ఈ గుత్తేదార్ల అడుగులకు మడుగులు వత్తింది. ఒక్క సారి ఈ థర్మల్ ప్లాంటు నిర్మాణం అయితే 30 గ్రామాల ప్రజలకు కల్పతరువులా ఉన్న బీల అదృశ్యం అవుతుంది. పెద్ద మోతాదులో విడుదలయ్యే సల్ఫర్‌ డై ఆక్సై డ్‌ గురించి, మెర్క్యురీ గురించి, సాలీనా ఆ ప్లాంటు విసర్జించబోయే 50 లక్షల టన్నుల బూడిద గురించి, వీటి వల్ల రాగ ల రోగాల గురించి ఎవరు ఏమీ మాట్లాడరు. పంపింగ్‌ కారణంగా జరిగే నిరంతర సాగర మథనం వల్ల, నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల తీర ప్రాంతంలో జలజీవాల పునరుత్పత్తి బాగా దెబ్బతింటుంది. అంటే తీరానికి దగ్గరగా చేసే చేపల వేట దెబ్బ తింటుంది. ఇంతా చేసి ఈ ప్రాజెక్టు “మర్చంట్ పవర్ ప్రాజెక్టు” అంటే దీంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నాగార్జున కంపెనీ రాష్ట్రానికి ఇవ్వదు. ఖరీదుకట్టే షరాబును వెతుక్కుంటూ వెళ్తాయి ఈ సోంపేట విద్యుత్ వెలుగులు. కంపెనీ యజమానికి దండిగా కాసులు కురిపించే ఈ విద్యుత్ కేంద్రం స్థానికులకు మిగిల్చేది మాత్రం బూడిదా, చీకటీ మాత్రమే.

ఈ అమాయక ప్రజలు ఉంటారనే ఈ అభివృద్ధి గద్దలు ఇవ్వాళ శ్రీకాకుళంపై వాలాయి. ఉత్తరాంధ్ర ప్రజలు అంబలి గాళ్ళు, వారేమి చేస్తారులే, వారి నాయకులు మన కాలికింద చెప్పులై వున్నారు కదా అన్న ఫాసిస్టు ఆలోచనతో తప్పుడు అవగాహనతో ఈ ప్రాంత వినాశనానికి పూనుకున్నారు. కానీ నేను ముందు చెప్పినట్లు ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కానే కాదు.. "అదిగదిగో ఉద్దానం..ఉద్దానం కాదురా ఉద్యమాల వనం రా" ఈ పాట ఇంకా సజీవంగానే ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పటిమను పునికిపుచ్చుకొని జమిందారి వ్యవస్థ మీద కంచు కంఠంలా దండయాత్ర చేసిన పోరు గడ్డ, అందుకే ఉద్యమం వారికి ఉగ్గు పాలతో పెట్టిన విద్య. ఈ ప్రాంత వాసులు ఎంత సౌమ్యంగా జీవనం కొనసాగిస్తారో, తెగిస్తే ఉప్పెనలా విరుచుకుపడగలరని సోంపేట ఉదంతంతో అర్థం ఐతుంది.

బ్రతుకుతెరువును హరించే ఈ కంపెనీ మాకొద్దంటూ సోంపేట పరిసర గ్రామాల ప్రజలు అనేక నెలలుగా ఉద్యమిస్తున్నారు. నిరాహార దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు. కలెక్టర్ నుండి డిల్లీ పెద్దల దాకా అందరినీ కలిసి తమ గోడు వెలిబోసుకున్నారు. అయితే అభివృద్ధి టెర్రరిస్టులు ఏ మాత్రం  కనికరించకుండా ఏకంగా కాల్పులే జరిపిండ్రు. “అభివృద్ధి” కొరకు త్యాగాలు చేయాలని టీవిల ముందు సన్నాయి నొక్కులు నొక్కే లోక్ సత్తా జే పి లాంటి వారిప్పుడు “ఎవరి అభివృద్ధికి ఎవరు త్యాగం చేయాలనే” ప్రశ్నకు జవాబు చెప్పాలి.

ఆగష్టు 15 2010 న, మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన ప్రసంగం లో ఒక వ్యాఖ్య చేసిండు: 'మన దేశం లో అంతరంగిక భద్రతా సమస్యలు నక్సలైట్ల వల్ల బాగా పెరుగుతుంది, వీళ్ళను ఎరివేయ్యతానికి ఒక ప్రత్యేకమైన ఫోర్సు కావాలి'. మరి అదే నక్సలిసానికి అత్యంత మూల కారణమైన ఇటువంటి పెట్టుబడిదారి టెర్రరిస్టులను అంతమొందిన్చనీకి ఏ ఫోర్సు ఏర్పాటు చేస్తున్రు?