Thursday, 25 February 2010

Independence




నాకు అప్పుడు 12 సంవత్సరాలు అని గుర్తు.. బయట పిల్లలతో కలిసి ఆడుకొని చీకటిపడే సమయానికి ఇంటికి వెళ్ళా.. అప్పట్లో మా ఇంట్లో గడియారం లేదుగా.. సరైన సమయం తెలీదు.

వెళ్ళేసరికి మా నాన్న ఇంట్లో దీపాల వెలుగులో (మా ఇంట్లో కరెంటు నేను నాన్నని అయ్యి , మా నాన్న చనిపోయాక వచ్చింది.) ఎవరితోనే మాట్లాడుతూ.. రేపు మనకు స్వాతంత్రం రాబోతుంది అని.. ఇంకా ఏదో చెబుతున్నాడు.. నేను సాయంత్రం ఆడుకుంటుంటే కూడా ఎవరో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ, రేపు మనకు స్వాతంత్రం వస్తుందని మాట్లాడుకుంటూ వెళ్ళారు. అప్పటికి మనలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారని మాత్రమే నాకు తెలుసు.. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో దీని గురించి మాట్లాడుతున్నారు.

కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ అన్నం తిను అని అన్నం పెట్టింది... నేను అన్నం తింటూ వాళ్ళ మాటలని వింటూ , ఒక్కసారిగా వాళ్ళ మాటలకి అడ్డం వస్తూ..నాన్నని అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి? అది ఇప్పుడే ఎందుకు వస్తుంది? అది ఇంతకు ముందు మనకు లేదా? ఒకవేళ వుంటే ఎవరు లాగేసుకున్నారు? అసలు బ్రిటిష్ వారు ఎందుకొచ్చారు? మన స్వాతంత్ర్యం వాళ్ళ వల్లనే పోయిందా? అని ప్రశ్నల పరంపర వేశాను..

.. నాన్న నా వైపు చూసి ..చెప్పడం మొదలుపెట్టాడు.." బ్రటిష్ వాళ్ళు మన దేశాన్ని అక్రమంగా ఆక్రమించారు ... మన దేశం లోనే మనల్ని పరాయివాళ్ళు చేసి.. మనల్ని బానిసలుగా చేసి మన దేశ సంపద అంతా దోచుకుంటున్నారు...." అని ఇంకా ఏదో చాలా చెప్పాడు... అప్పటి నా వయసుకి ఆ మాటల్లో బానిసలు, ఆక్రమించడం లాంటి ఇంకో రెండు పదాలు అర్థం అయ్యాయి .. వెంటనే మరి మన దొడ్లో పశువులకి స్వాతంత్ర్యం ఎప్పుడు అని ఒక్కసారిగా అడిగాను?

ఆ క్షణంలో నాన్న నా వైపు ఆశ్చర్యం మరియు సందేహంతో కూడిన చూపు చూడడం .. మరు క్షణం అమ్మ నన్ను కేక వేయడం .. తక్షణం నేను అక్కడి నుండి అమ్మ దగ్గరకి పరిగెత్తడం జరిగాయి. అమ్మ నాకు పెరుగు వేస్తూ ... దొడ్లో ఆవులను విడిచిపెడితే ఇలా నువ్వు రోజు తినే పెరుగు, పాలు ఎలా వస్తాయీ? అందుకే వాటిని కట్టేసాము అని చెప్పింది.. దాంతో నేను ఓహో ! అని ఇప్పుడు అర్థం అయ్యింది అమ్మా ! అన్నాను.. " ఆవు నుండి వచ్చే పాల కోసం మనం ఆవుల్ని కట్టేసినట్లు, బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశం నుండి వచ్చే ధనం కోసం మనల్ని ఆక్రమించారు కదా " అని కనుబొమ్మలెగరెసాను.. అమ్మ విసుగ్గా అలా కాదురా... అది వేరు .. ఇది వేరు.. పశువులతో మనకున్న ప్రేమ, ఆత్మీయ సంభంధం వేరు... అని ఏదో చెపుతుండడం.. నేను నిద్ర లోకి జారుకోవడం జరిగిపోయాయి.

ఆ తర్వాత రోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి.. కాని అప్పటి నా వయసుకున్న ఆలోచనకు మాత్రం .. మా ఊర్లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. మా మల్లి గాని నాయిన రోజూ తాగి వచ్చి వాళ్ళ అమ్మని కొడుతూనే వున్నాడు.. ఇక్కడ వాళ్ళ అమ్మకి స్వాతంత్ర్యం ఏం రాలేదు అనిపించింది... అలానే మా ఊర్లో దొర, మమ్ములను ఇంకా బానిసలుగానే చూస్తున్నాడు. అగ్రహారపు వీధుల్లోకి మా మల్లి గాన్ని రానివ్వట్లేదు. కాకపొతే ఊర్లో ఒక్క తెల్లదొరలు మాత్రం కనిపించట్లేదు., అప్పుడే నాకు మా పంతులు చెప్పిన గురజాడ గారి "దేశమంటే మట్టి కాదోయి.. దేశమంటే మనుషులోయ్ " అనే గేయం గుర్తుకువచ్చింది... .. అప్పుడు అర్థం అయింది .. "మన దేశం లో మట్టికి స్వాతంత్ర్యం వచ్చింది... ఇంకా మనుషులకు స్వాతంత్ర్యం రావాల్సి వున్నది అని"...దాని దిశగానే.. మా మల్లి గాన్ని తీసుకొని.. అగ్రహారం దిశగా.. నా అడుగులు పడ్డాయి....

-the writer is Nikhil, an engineering graduate, presently aiming for Indian civil services

Email: nikhild11@gmail.com

No comments:

Post a Comment