తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది.హేతువాది. మరాఠీ, ఇంగ్లీషు,ఉర్దూ భాషల్ల పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులకి అనువదించిండు. కాళోజి కథలు, నా గొడవ, జీవన గీత మొదలైనవి ఆయన రచనలు. మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం, రాజకీయాలు ఆయన ప్రాణం. ఆర్యసమాజ భావజాలం పట్ల ఆకర్షితులై నిజాం నవాబు కారుమీద బాంబు విసిరాడు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించారు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నారు. రెండేళ్లు రాష్ట్ర విధానపరిషత్తు సభ్యుడిగా ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు.పి.వి. నరసింహారావు, కాళోజీ ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు. విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక ఆయన భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు! అయితే ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు. అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించిండు. బూటకపు ప్రజాస్వామ్యాన్ని, కోస్తా ఆధిపత్యాన్ని వ్యతిరేకించిండు. 2002 నవంబరు పదమూడో తేదీ కాళోజీ కన్నుమూశారు!
కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టారు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా-కాళోజీ
ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి
'పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిది --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి
" ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. " - కాళోజీ
No comments:
Post a Comment