Monday, 16 April 2012

ఓ తెలంగాణ మిత్రమా..! మనది ఆఖరి పోరాటం కాదు..ఇది ఆగని పోరాటం

మన జీవనం
ఆగిపోతే పర్వతం
కరిగితే మంచు
ప్రవహిస్తే సెలయేరు 
పరిభ్రమిస్తే సుడిగాలి
సంక్షోభిస్తే విపత్తు 

నిన్నటి జ్ఞాపకాల కలలో లీనమైతే
రేపటి దిక్కుగా నీ ప్రస్థానం సాగదుగా 

అపజయాలెన్నో అడియాసలు రేపినా
నడిచే జీవితం అడుగైనా ఆగదుగా

పుట్టే పొద్దుకు కన్నులు స్వాగత పత్రాలని
చీకటి వెన్నెలలో కలలు కనటం మానుతామా

సృష్టి నాడిలో అనుక్షణం చావు చప్పుడున్నదని
తల్లి బిడ్డకి జన్మనివ్వటం ఆపుతుందా

పెను తుఫానుల అలలను తిప్పికోట్టినప్పుడే
నేల తల్లి తీరం స్థిరంగా నిలిచేది

గొంతు మూగ పోయిందని భావాలు మూతపడవు 
నరాల రెక్కలతో విహంగ విన్యాసం చేస్తాయి

నీ ప్రాణానికి కదలిక ఆగిపోయిందని
ఉదయించిన నీ ఆశాజ్యోతులు ఉరకలేయ్యటం ఆపుతాయా

ఆశల తెరల మధ్య నిరాశల పొరల మధ్య
సాగే సుఖదుఖాల తరంగాలే మన జీవన ప్రవాహం

ప్రస్థానంకి ఎప్పుడు ముందు చూపే,
జ్ఞాపకానికి మాత్రం వెనక
తల్లి కడుపులోకి మళ్ళీ పోలేంగా
కానీ ఆ పేగు బంధం ఈ పెగుతో పెనవేసుకుని పోతుంది
విశ్వ యవనికతో భూమి శృతి కలిపినట్లు....

ఈ జీవన ప్రస్థానంలో
ఒడిదొడుకులు సహజం
క్షణికావేశంలో
ప్రాణం విలువ మరువకు

"మిత్రమా మన పోరాటం 
ఆఖరి పోరాటం కాదు.. 
ఇది ఆగని పోరాటం.."

నాటి మేడారం సమ్మక్క సారక్క గద్దెల సాక్షిగా
నేటి గన్ పార్కు అమర వీరుల స్తూపం గుర్తుగా
"స్వయం పాలన, ఆత్మ గౌరవం" కోసం
తెలంగాణ ప్రజలు రాజీ లేని పోరాటం
800 ఏండ్ల నుండి చేస్తున్నారు

దానికి రాష్త్ర సాధన
ఒక ముగింపు కాదు
ఆరంభము కాదు,
ఒక మహా అధ్యాయం మాత్రమే !!

ఈ తెలంగాణ మహా ప్రస్థానంలో
ఇంకా ఎన్నో మహోధ్యయాలు
లిఖించాల్సి ఉందని మరువకు...!!

ఆత్మహత్యతో నువ్వు చరిత్రలో నిలువవు
మిగిలేది నీ కుటుంబానికి పుట్టెడంత దుఖం
నిన్ను కన్న అమ్మకు
ఈ తెలంగాణ తల్లికి
తీరని గర్భ శోఖం

నిజమైన ఉద్యమకారులు
అపజయంతో క్రుంగి పోరు
విజయాలతో పొంగి పోరు
కలబడి నిలబడి కొట్లాడిన వారే వీరులు
అలాంటి వారే చరిత్రలో మిగిలేది నిలిచేది

ఓ కొమురం భీం.. ఓ రాంజీ
ఓ జయ శంకర్.. ఓ కాళోజి
ఓ కోటన్న.. ఓ జార్జి రెడ్డి

వీర తెలంగాణ
పోరు తెలంగాణ
జై తెలంగాణ
జై జై తెలంగాణ

--
నిశాంత్ దొంగరి
(మేరీ క్యూరీ రీసెర్చు స్కాలర్)

2 comments:

  1. మస్త్ చెప్పినవ్ అన్నా!!

    "ఈ తెలంగాణ మహా ప్రస్థానంలో
    ఇంకా ఎన్నో మహోధ్యయాలు
    లిఖించాల్సి ఉందని మరువకు...!!" అన్న వాక్యాలు చాల బాగున్నయ్!!

    ReplyDelete