Sunday, 5 May 2013

టైం మెశీను (Time Machine)



ఫేస్ బుక్కుల ఒక స్కూల్ మేట్ తోటి చాట్ చేస్తుంటే.. సూర్యాపేటల నా చిన్నప్పటి సరదా అల్లరి దినాలు మొత్తం యాదికొచ్చినయ్... ఆదిత్య 369 సినిమాల లెక్క... టైం మెశీను గనక ఉంటే అందుల ఎనకకి ప్రయాణం జేసి మల్లా ఓ సారి నా బాల్యం మొత్తాన్ని జీవించాలని అనిపిస్తాంది... కానీ ఏం లాభం మొన్ననే 3rd ఇయర్ పోరల్లకు పాఠం చెప్పుండే: "సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్సు ప్రకారం, కాలం ఎనకకు పోవుడు ససేమిరా కుదరదని"...

బచ్ పనాని మించిన మాధుర్యం లేనే లేదు... ఇంకా మేమైతే సాదా సీదా తెలుగు మీడియం స్కూల్ల సదివినం కాబట్టి... అస్సలు ఆ జిందగీకి హద్దులే లేవు... ముత్యాల వంటి కొన్ని జ్ఞాపకాలని ఒక దగ్గర చేరిస్తే మంచి హారం అయితది అనిపించింది (మీరు కూడా జర్ర గుర్తుకొచ్చినయన్నీ రాయండి)

ఇంటి పక్కన స్కూలున్నా.. లంచ్ బాక్సు పట్టుకపోయి దోస్తులందరికీ ఉన్నంతల పంచేది
ఆ తిన్నదంతా అరిగేదాంక.. అమ్మాయిలం అబ్బాయిలం కలిసి పిచ్చి బంతి మస్తు ఆడుతుండే
ఎవరి మీద ఎక్కువ కోపం వుంటే వానికి యమ తగిలేది ఆ బంతి..
ఆ బాల్యానికేం తెలుసు యవ్వనంలో అత్యాశ, ద్వేష దుర్మార్గ కామ దాహాలతో రగిలిపోతామని

ఆదివారం వస్తే చాలు పొద్దు పొద్దుగాలనే పొయ్యేది క్రికెట్ మ్యాచ్ ఆడనీకి.. అస్సలే 10 రూపాయల బెట్టింగు
చేతికో..కాలుకొ దెబ్బ తగిలిచ్చుకొని ఇంటికొచ్చేది...వాటి మీద ఇంట్లోల్లు ఇంకో నాలుగైదు తగిలిచ్చేటోల్లు
అమ్మయితే జర్ర కోపానికొచ్చి మల్ల గనక ఆడనీకి పోతే బ్యాటు పొయ్యిల పెడతా బిడ్డా అని బెదిరిచ్చేది
ఆ చిన్నతనానికేం తెలుసు.. పెద్దయితే సెలవు దినాల్లో కూడా యంత్రాల్ల పనిచేస్తామని....!!

ఇంకా నాకు బాగా గుర్తుంది ఏందీ అంటే.. సారుకు క్లాసుల కోపమొస్తే మమ్మల్ని క్వశన్లు అడిగేది
ఆన్సర్ తెల్వకపోతే ఆయన కొట్టినా బాగుండేది.. కాని సమాధానం చెప్పినోల్లతోటి కొట్టిపిచ్చేది...
పోరగాండ్లు కొడితే పర్లేదు.. కానీ అప్పుడప్పుడు అమ్మాయిలతోటి ముక్కు మీద చెంప దెబ్బలు పడేటియి..
ఇజ్జాత్ మానం మొత్తం మంటల కలిసినట్లు మస్తు ఫీల్ అయ్యేది.. ఇంగ ఇండియా-పాకిస్తాన్ యుద్ధమే
మల్లా అసొంటి చాన్సు దొరికితే ఇప్పటి TV సీరియల్ల రేంజుల.. రివేంజి అంతకు పది రెట్లు ఉండేది

మా ఇంట్ల దోస్తులందరం బంగ్లా మీంచి దుంకే ఆటాడేది
అప్పట్ల కాళ్ళు చేతులు ఇరుగుతాయ్ అనే ఫికరే ఉండకపోతుండే
చిన్నప్పుడు 1st ర్యాంకు వస్తే మా ఇంట్ల 5 రూపాయల క్వాలిటీ ఐస్ క్రీమ్ కొనిచ్చేది
అప్పటి ఆ ఆనందం నేటి ఏ అవార్డులు రివార్డులతో సరిపోదు..
ఇట్లా ఎన్నో మరెన్నొ.. రాస్తే రామాయణం అంత అయితది అనుకుంట

ఆడటం.. పాడటమ్.. నవ్వటం.. త్రుల్లటం.. ఏడ్చి ఏడ్చి అమ్మ దగ్గరికి పోవటం..
అమ్మ యెదలోపల అమృతాన్ని అనుభవించగల పుణ్యుడు, అనన్యుడు, అమాయకుడు
అఖిల లోకాల్లో అమలిన ఆనందాన్ని తన వశం చేసుకునే అమృతాన్ధసుడు --- బాలుడు

పసివాడు దేవుడంటే ఇదేనోమే, ఇంత స్వర్గానుభూతి దేవతలు కాని పొందలేరు
దైవత్వం పసితనాన మన మనసుల్లో ఉండి దేవతలుగా ఊగించి ఊగించి
యవ్వనం అనే యాంత్రికమైన నరజన్మలోకి అమాంతం ఇసిరేస్తుంది కొన్నాళ్ళకి

కృత్రిమాల కుడ్యాల చాటున కంపులో, ముళ్ళ కంపలలో సంతోషం ఉందని
భ్రమపడే మనందరికీ మళ్ళీ ఏనాటికైనా -- ఆ బాల్య దివ్య సౌధాగ్రాల కురిసే
ముత్యాల నవ్వుల చిరు జల్లులు మన జీవితంలో మళ్ళీ లభించేనా, లాభించేనా ??

నీడలు లేని మెత్తని వెన్నెలలలో, ముళ్ళు లేని మల్లె తీగల ప్రక్కగా
దుర్గంధం లేని మనస్సు కుల్యాజలంలో బాల్యం అనే నౌక మీద ప్రయాణం చేసే
దివ్య సమయాలు మళ్ళీ వచ్చేనా ? ఏమో !!

-- (చిన్నప్పటి) నిశాంత్

No comments:

Post a Comment