చరిత్ర రధ చక్రాలు వడి వడిగా కదులుతుంటే
తెలంగాణ ఉద్యమం ఆ చరిత్రనే మలుపు తిప్పుతుంది
ఆ ములుపులన్నీ రక్త సిక్తమై ఎవ్వరు
ఊహిన్చని దారులకు తరలి పోతాంది
గడియ గడియకు రక్త తర్పణాలు
అడుగడుగునా ప్రాణ త్యాగాలు, అమరాత్వాలు
ప్రాణమివ్వడమా అంటే పొద్దు పోడవటమా అన్నట్లు
ఈ గడ్డ మీద జీవితం అంటేనే పోరాటం
తర తరాల కెల్లి బ్రతుకంతా త్యాగాలమయం
ఈడ సంపాదన అంటేనే ఆత్మ గౌరవం, ధిక్కార స్వరం
అందుకే యువకులు, విద్యార్దులు ఈ ఉద్యమాన్ని
ముందుకు, మున్ముందుకే తీస్క పోతాన్రు
కానీ యాడ ఎనక్కు తిరగలే
నేటి యాంత్రిక ప్రపంచంలో
యువత పుట్టుకతోనే వ్రుద్దులవుతున్నారు
కానీ తెలంగాణ యువత మాత్రం
ముందు యుగపు దూతలవుతున్నారు
50 ఏండ్ల సంది వీధులలో నవ యువకులు
ఏరులై పారించిన రక్తం ఉడుకు ఇంకా తగ్గలేదు
తల్లి తెలంగాణ కోసం రక్తాభిషేఖాలు అశ్రుసిక్త నయనాలు
నేటికీ నైవేద్యాలుగా కొనసాగుతున్నాయ్
అసంకల్పిత ప్రతీకార చర్య వోలె స్పందించే హృదయం
తెలంగాణ బిడ్డలకు అమ్మ పాల నుండే వస్తదేమో
ఒక వైపు చిప్ప టోపీ పోలీసుల లాఠీ చార్జి
మరో వైపు CRPF ప్లాటున్ల వ్యాన్ సైరన్లు
అటు వైపు పక్డో పక్డో మారో మారో అని రాక్షసుల్లాగా అరుపులు
ఇటు వైపు దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ జై జై తెలంగాణ నినాదాలు
పొరల్ల కాల్జేతులు కట్టే పుల్లల లెక్క ఇరిగిపోతున్నయ్
తల కాయలు పుచ్చ పండ్లోల్లె పగులుతున్నయ్
గొట్టాల నుండి వస్తున్న గుండ్లు గుండెలను చీల్చుకొని పోతున్నాయ్
ఇంత జరిగినా భయం లేదు, ప్రాణం మీద తీపి అంత కన్నా లేదని
మరో సారి తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ
ఆరాటాల పోతు గడ్డ
అని ప్రపంచానికి తెలియ జేస్తున్రు
పొడిసేటి పోద్దోలె, మండేటి నిప్పోలె, ఎగిసేటి అలవోలె
ఆవేశాలు కట్టలు తెంచుకుంటున్నా
మొక్కవోని దీక్షతో గమ్యాన్ని ముద్దాడాలని
శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టే పద్మ వ్యూహాలతో
మున్ముందుకు దూస్కపొతాన్రు
నాటి సమ్మక్క సారక్క ల గద్దెల సాక్షిగా
నేటి గన్ పార్క్ అమరవీరుల స్తూపం గుర్తుగా
శతాబ్దాల కెల్లి తెలంగాణ బిడ్డలది ఒకటే లడాయి
ఆత్మ గౌరవమే ధ్యేయం, స్వయం పాలనే లక్ష్యం
ఆ లక్ష్యం కోసమే మా తర తరాల ఆరాటం
ఆ తల్లి కొరకే ఈ బిడ్డల రాజీ లేని పోరాటం
జై తెలంగాణ జై జై తెలంగాణ
--
నిశాంత్ దొంగరి
No comments:
Post a Comment