Friday 15 June 2012

Beautiful Lyrics on Rain



(# Goreti Venkanna)
వానొచ్చెనమ్మ  వరదొచ్చెనమ్మా
వానతో పాటుగా వనుకొచ్చేనమ్మా

కొట్టం పై రాలి మట్టినంతా కడిగింది
కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది
చెట్ల కురులా మీద బొట్లు బొట్లు రాలి
గట్ల కొండల మీద గంధమై పారింది
దున్నపోతులనేమో దున్కులాడించింది
బర్లా మందనేమో చెర్లల్ల ముంచింది !!

కొత్తా నీటితో వచ్చి కోనేటిల చేరింది
చేపాకేమో నీటి పులుపు తాపింది
కొంగకేమో విందు కోరిక రేపింది
కప్పల పండగ కండ్లార చూసింది
తాబేలు పెండ్లికి తల నీరు పోసింది !!

పారాడి పారాడి గోదారిలో కలిసి
సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది
వంకలు డొంకలు వనమూలు తిరిగి
కృష్ణమ్మ ఒడిలో ఇష్టమూగ ఆడింది
ఇష్టమే లేకున్నా పట్నానికొచ్చింది
ముక్కు మూసుకొని మూసీల దున్కింది !!

(# Jaya Raj)
వానమ్మ.. వానమ్మ.. వానమ్మ,
ఒక్కసారన్న వచ్చి పోవె వానమ్మ,
చేలల్ల నీళ్ళు లేవు..
చెల్కల్ల నీళ్లు లేవు,
వాగుల్ల నీళ్ళు లేవు..
వంకల్ల నీళ్ళు లేవు,
నిన్ను నమ్మిన రైతు
కండ్లల్ల నీళ్ళు లేవు...............

(# Ande Sri)
చినుకమ్మ.. వాన చినుకమ్మ,
నేల చిన్నబోయినది బతుకమ్మ,
మేఘాల దాగుండి పోకమ్మ,
ఆగమేఘాల మీద నువు రావమ్మ.........

(# Nandini Siddha Reddy)
వరద గూడు కడితె వానొచ్చునంట,
బురద పొలము దున్ని మురిసున్నరంత,
శివుని గుళ్ళె నీళ్ళు చీమలకు శక్కరి,
వాన కొరకు భజన జడకొప్పులేసి....
పారేటి నీళ్లల్ల పానాదులల్ల,
పూచేటి పువ్వుల్ల పునాసలల్ల,
కొంగు చాపిన నేల నా తెలంగాణ,
పాలు దాపిన తల్లి నా తెలంగాణ

(#Kaloji)
రుతువు మారుద్ది 
ఆకు పండుద్ది..
ఊగుద్ది.. ఊగి రాలుద్ది !!
డోలు మోగుద్ది..
మోగుద్ది సద్దు మణుగుద్ది !!
పత్తి వెలుగుద్ది..
వెలుగుద్ది వెలిగి మలుగుద్ది !!
బతుకు పోరుద్ది..
పోరుద్ది పోరు మానుద్ది !!

ఆ తరువాత...
చినుకు జారుద్ది..
ఇంకుద్ది కెలక వూరుద్ది !!
నీరు చేపు ద్ది,
తాపుద్ది ఏరు పారుద్ది,
చేను ఇంకుద్ది..
ఇంకుద్ది గింజరాలుద్ది !!
బతుకు పోరుద్ది..
పోరుద్ది రుతువు మారుద్ది !!
మోడు ఎండుద్ది..
ఎండుద్ది బెరడు చిట్లుద్ది !!
కొమ్మ మురుసుద్ది..
మురుసుద్ది చిగురు ఎత్తుద్ది!!
బతుకు పోరుద్ది..
పోరుద్ది రుతువు మారుద్ది...........

No comments:

Post a Comment