Friday 22 February 2013

Duscharla Satyanarayana - A Man Who Inspires Many

 


 వేప చెట్టే మా గౌరవాధ్యక్షులు

ప్రజలలో తిరుగుతూ, ప్రజా సమస్యలపై పోరాడే నేతలు అతి తక్కువ మంది. అలాంటి వారిలో దుశర్ల సత్యనారాయణ ఒకరు. ఆయన వృత్తి బ్యాంకు ఉద్యోగమయినా.. ప్రవృత్తి మాత్రం ప్రజా సమస్యలపై పోరాటమే. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం పోరాడిన ఆయన జీవితంలోని అనేక పార్శ్వాలు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఉత్తేజపరుస్తాయి. వాటన్నింటినీ నమోదు చేసిన పుస్తకం- జల సాధన సమరం. దీనిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం..

జల సాధన సమితి గౌరవాధ్యక్షులుగా ఎవరిని తీసుకుందామన్న చర్చ వొచ్చింది. వావిలాలను గౌరవాధ్యక్షునిగ తీసుకుందామని కూడా అనుకున్నం. ఆయన గాంధీ తర్వాత గాంధీ అనుకొని పోతే నరనరాన ప్రాంతీయతత్వం బయట పడ్డది. ఇగ ఆయనను ఎట్ల పెట్టుకుంటం. పక్కకు పెట్టినం.

ఇంద్రారెడ్డి, చిన్న వెంకట్‌రెడ్డిలను కూడా అనుకున్నం. కాని (వాళ్లు) ఉద్యమాన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలతో రాసుకుపూసుకు తిరుగుతుండడంతో ఆళ్లను కూడ పక్కకు పెట్టినం. రొండు మూడు రోజులకోసారి వొందల మందిమి కూసునేది. ఎప్పుడైనా అట్ల కూసున్నప్పుడు (ఎవర్ని పెట్టాలన్న విషయం) చర్చల కొచ్చేది. చర్చల ఆడోల్లు మొగోల్లు అంత ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేది. అట్ల మాట్లాడుతున్నప్పుడు... సార్ ఈ మనుషులు ఒకరు ఇటు గుంజుతరు ఇంకొకరు అటు గుంజుతరు.



మొదటి నుంచి చూస్తనే ఉన్నం. కాబట్టి మనుషులు కాకుంట మన ఎల్లమ్మ చెట్టుంది సార్. ఈ ఎల్లమ్మ చెట్టు తింటెనేమో చేదుంటది. మింగుదామంటె ఎవడు మింగలేడు. ఓ చెట్టును కొడితె ఇంక పది చెట్లు పుడతయ్. మల్ల అది ఇగురొస్తది. చెట్టు నీడనిస్తది. ఎండకాలం కూడ సల్లగుంటది. కాబట్టి ఎల్లమ్మ చెట్టును పెట్టుకుందాం సార్ గౌరవాధ్యక్షునిగ అని సలహా వొచ్చింది. అంతా గ్రామస్తులు. ఆళ్లు ఇచ్చిన సలహా అది. అందరు ఒక్కసారే సప్పట్లు కొట్టిండ్రు. ఎల్లమ్మ చెట్టే పెట్టుకుందాం మనం గౌరవాధ్యక్షునిగ అని. అప్పటి నుంచి గౌరవాధ్యక్షురాలు ఎల్లమ్మచెట్టే. అది యాపచెట్టు.

ఇదే యాపచెట్టు ఢిల్లీ యాత్రలల్ల... పోంగానె జంతర్‌మంతర్‌ల నీడనిచ్చేది. యాపచెట్ల కింద కూసునేది. యాపచెట్ల కింద పడుకునేది. అదే యాపచెట్టు పుల్లలు తీసుకొని... తీస్కపోయిన బియ్యం వొండుకొని... తీస్కపోయిన మాడిసిన కారం ఏసుకొని తిండి తినేది. పొయిల కట్టెలయినయ్. ఆ యాపచెట్టు అక్కడ ఆశ్రయమిచ్చింది. ఇక్కడ ఇచ్చింది. యాపచెట్టును గౌరవాధ్యక్షురాలిగ తీసుకోవటానికి కారణం ఇది.* * *

మూడు కరువులుఇగ ఈ ప్రాంతంల కరువులు. మా నాయన చెప్పేది. నేను అప్పుడు నాలుగో తరగతిలోనో అయిదో తరగతిలోనో ఉన్న. చెనిగ చేలు పీకిండ్రు. వానాకాలం చెనిగ చేల్ల పండుకున్నప్పుడు కుప్పల దగ్గర. ఆకాశం దిక్కు చూసి చుక్కల గురించి చెప్పిండు. పోలార్‌స్టార్ అంటరు ధృవచుక్క. దృవుడు. ధృవుని చర్రిత ఇది. ఈ పోలార్‌స్టార్ చుట్టూ నక్షత్ర మండలం మొత్తం తిరుగుద్ది అని చెప్పిండు నాలుగో తరగతిల. ఇవి సప్తమహర్షులు. ఈ మహర్షి ఈయన. . . ఈయన. . . ఈయన... ఈ ఏడుగురు మహర్షులు ఇది. దీనికి ధృవ చుక్కకు సప్తరుషులకు సక్కగ సరళరేఖ మాదిరిగ గీత ఉంటది. తర్వాత మూడు పక్కకు ఉన్నపుడు మధ్యన ఏదయితె ఉందో ఈ మధ్య చుక్క ఇది. వశిష్ట మహర్షి భార్య అరుంధతి. ఆమె మహాపతివ్రత. ఇవన్ని చెప్పుకుంట వొచ్చిండు.



అప్పుడే నాయనా కరువులు వొచ్చినయ్ మన ప్రాంతంల అని చెప్పిండు. కరువులు కూడా ఎట్ల అంటె డొక్కల కరువు అని వొచ్చిందయ్యా. ఆ డొక్కల కరువుల తినటానికి ఊర్లల్ల ఏం ఉండేది కాదు. కలిగినోల్లు అన్నం తింటె. .. తినంగనే ఎదురుంగ ఉన్నోడు ఆన్ని సంపి డొక్క చీల్చుకొని ఆని కసరుతిని బతికిండ్రు. మా తాతల దగ్గర నుంచి ఇది చెప్పుకుంట వొచ్చిండ్రు. అది డొక్కల కరువు.

తర్వాత మా అప్పుడు కూడ వొచ్చింది. జొన్నలు ఈ ప్రాంతంల పండలే. (అసలు) పంటలే పండలే. అప్పుడు తెల్లజొన్నలు వొచ్చినయ్. తెల్ల జొన్నలు వొచ్చినపుడు తెల్ల జొన్నల కరువు అన్నరు దాన్ని. ఆ జొన్నలు తిని బతికిండ్రు. బురద కరువు కూడ అప్పుడే వొచ్చింది. అంటే చెరువులు కుంటలల్ల బురద పేరుకుపోతది. ఆ బురదను తాగి బతికిన రోజులు ఉన్నయ్. ఇట్లాంటి కరువులున్నయ్ నాయినా అని చెప్పిండు మా నాయిన.

నా చిన్నప్పుడు కూడ మా జీతగాండ్లు. . . ఇంకా నాకు యాదికుంది. పిచ్చయ్య అని అచ్చయ్య అని అచ్చాలు అని ఉండేది. మా అమ్మలేమో అప్పుడు పోటు ఏసేది వొడ్లు. ఆ నూకలు పెడితె అయ్యి తిని ఆ గంజి తాగేది ఆల్లు. ఆల్లకు ఇప్పట్లా డబ్బులు లెక్క జీతాలు కాదు. వొడ్ల లెక్క జీతాలు. జొన్నలు వొడ్లు సద్దలు నెలకిన్ని కుండలు అని జీతాలుండేవి. రోజు మా ఇంటి దగ్గర పాలు పెరుగు సల్ల ఉంటె ఆ సల్ల తాగేది. ఇయ్యితిని పోయి జీతాలు చేసేది. ఈత చెట్లను కొట్టి ఆ గుజ్జు తినేది. ఆకలికి ఈత గుజ్జు తినేది. నా చిన్నప్పుడు చూసిన ఆ కరువు. ఈత గుజ్జు కరువు. ఈ కరువులు కూడ ఎందుకు అని అంటె నీళ్లు లేకనే. నదుల నీళ్లు మన దగ్గర సరఫరా లేకనే. ఉన్న నీళ్లను ఆకట్టుకోకనే. ఉన్న నీళ్లను కాపాడుకోలేనందుకే ఈ రకంగ వొచ్చినయ్ అనేది అర్థం అయ్యింది.

కాబట్టి ఈ కరువులు ఇవ్వన్ని కూడ బుర్ర కథలల్ల చెప్పిచ్చినం. ఈ బుర్రకథ కోలాటం... ఆయన పేరు లింగాల ప్రతాపరెడ్డి. ఆల్లది శాబ్దుల్లాపురం. ఉద్యమాలల్ల తెలంగాణ ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమంల చురుకైన పాత్ర పోషించిండు. ఆయన పాటలు రాసేది. బుర్రకథలు రాసేది. మన స్పీచ్‌లు కూడా ఇని నా మాటలు ఇని ఆ మాటలే కోలాటం రూపంల ఆయన రాసిండ్రు. ఈ కరువులన్ని విపులీకరించిండ్రు బుర్రకథలల్ల కోలాటం రూపాలల్ల.

నదుల నీళ్లను దాసుకుంటె ఈ కరువులు రావు. ఎక్కడ వీలైతె అక్కడ దాసుకోవాలె. ఆప్టిమం యూజ్ చేయాలె. వృథాగ సముద్రంల వొదిలేసి తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటె కరువులు వొస్తానే ఉంటయ్యి. వొరదలు కూడ అందుకనే వొస్తున్నయ్. కాబట్టి దీన్ని ఎట్లా అయినా స్ట్రీమ్‌లైన్ చేసి సీజన్ ప్రకారం చేయాల్సిన తపన ఉంది.

అక్కడికి ఇక్కడికి తేడా ఉందితాడేపల్లి గూడెంల ఒక విచిత్రమైన పరిస్థితి ఏందంటే... అందరు ఉద్యోగులు ఏలూరు నుంచి వొస్తరు పది గంటలకు. కాపలా కాస్తరు పిటిషన్ మాంగర్స్...దరఖాస్తుదారులు. పది గంటల ఒక నిమిషానికి వొచ్చినా ఆళ్ల దగ్గర నుంచి ఎంటనే రిపోర్టు పోతది హెడ్ ఆఫీసుకు. ఈయన లేటొచ్చిండు, ఈయన లేటొచ్చిండు అని. అట్ల కాపలా కాసే పిటిషన్ మాంగర్స్ ఉన్నరు.

నేను పోయిన ఆ ఊరుకు. పొద్దున ఆరింటికే బ్యాంకు ఓపెన్ చేసి కూసాని రాస్తున్న. ఇక కాంప్లెయింట్ ఎవరి మీద చేస్తరు. అసలు కాంప్లెయింట్లే బందు. ఓపెన్ చేసేదే ఆరింటికాయే. రాసుకుంటనే ఉండె. ఎవరన్న బాధల్ల ఉంటె వొచ్చి చెప్పుకునేది. అట్ల రాసుకుంట రాత్రి తొమ్మిది దాకా అండ్లనే ఉండేది. పొద్దున ఆరు గంటలకే మల్ల బ్యాంకుల ఉండేది. సీజన్‌ల...మధ్యాహ్నం రొండు గంటలకు భోజనానికి పోవాలె రొండున్నరకు రావాలె. అందరు భోజనానికి పోయినా నేను రాసుకుంట మూడు నాలుగు గంటల దాంక అట్లనే కూసునేది.

అక్కడ ఒక మహిళ ఏలుముద్దెరామె...సార్ నేను పొద్దున్నుంచి చూస్తున్న, పొద్దున వొచ్చినప్పుడు రాస్తుండ్రు, మీరు అన్నానికి పోలే సార్...మాకు ఇయ్యాల రాకపోయినా ఏమి లేదు. రేపు ఇచ్చినా ఏమిలే. ఎల్లుండి ఇచ్చినా ఏమీలేసార్. మీరు పోయి ఇంత అన్నం తిని రండి సార్ అన్నది.

మల్ల మనోల్లు...ఇక్కడ నల్లగొండ కొచ్చిన. దేవయ్య అని ఉన్నడు. గంధంవారి గూడెం. నేను రాత్రి పన్నెండు వరకు రాసుకుంట కూసున్న. పొద్దున ఐదింటికే వొచ్చి రాస్తున్న. పండ్లు తోమలే. ఎప్పటిదాంక తోమలే. రాత్రి ఏడింటిదాంక కూడ తోమలే. ఏమి తినలే. ఎందుకంటే రైతులకు సీజన్ టైమ్‌ల ఫైనాన్స్ ఉండాలె.

ఏడింటికి బిర్రుగ తిని పాను నములుకుంట వొచ్చిండు. ఎర్రగ నోరుంది. కండ్లు ఎర్రగయినయ్. నల్లగొండ టానిక్ ఏసుకొని వొచ్చిండు. సార్ నా లోన్ ఎప్పుడు సార్ అన్నడు. ఏమయా పొద్దున నుంచి రాస్తున్న పండ్లు కూడ తోమలేదు అన్న. నేను ఎందుకనాల్సి వొచ్చింది అంటె...నువ్వు ఇట్ల తాగి తిని వొచ్చినవ్. అంత అర్జెంటు ఏంది అని.
సార్ నాకు ఎరికే సార్. మీరు ఏం తినలేదని ఎరికే. పండ్లు తోమలేదని ఎరికే. కాని నా ఒక్కనిది రాయ్ సార్ అన్నడు. అంటె తెలంగాణల...నేను పుట్టిన జిల్లాల బంగారు గుడ్డు బాతుగుడ్డు సమానం. ఏందీ..నువ్వు తింటే ఏంది తినకుంటె ఏంది. నాకు ఇచ్చేదేందో ఇచ్చి సావు.

అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. నేను గమనించిన. ఆల్లు అక్కడ ఆంధ్రా తమిళనాడోళ్ల దగ్గర నేర్చుకుండ్రో లేకుంటె బ్రిటీష్ గవర్నెన్సుల నేర్చుకుండ్రో తెల్వదుకాని పని అంటె తపన ఉంది ఆళ్లకు. స్ట్రగుల్...ఎగ్జిస్టెన్సీ కొరకు స్ట్రగుల్. జనం కొరకు పని చేయాలన్నప్పుడు...నా జీతం భత్యం నేను తీసుకుంటున్న, ఇయ్యాల నేను చేసే పనికి నాకు అదనంగ ఏమొస్తదీ అనే దేవులాట ఎక్కువుంది. అయితేనే పని చేస్త లేకుంటె లేదు. అక్కడ ఆళ్ల ప్రాంత కోసం పని చేసే ఉద్యోగస్తుల తపన కనపడ్డది. ఆర్టీసీ డ్రైవర్ల దగ్గర నుంచి కానీ కండక్టర్ల దగ్గర నుంచి కానీ గ్రామాలల్ల కానీ ఒక తపన కనపడ్డది.

ఇంకొకటి...విలేజి అసిస్టెంట్లు. పట్వారీలు...నేను వొరదల ప్రాంతాలల్ల తిరిగిన ఆ గ్రామంలో ఒక్క మడి మునిగితే, ఒక పావు ఎకరం మునిగితే గ్రామమంతా మునిగిందని రికార్డు పంపుతరు. మండలం మొత్తం మునిగిందని రికార్డు పంపుతరు. దాని వల్ల ఆళ్లకు క్రాపు ఇన్సురెన్స్ వొస్తది. ఫ్లడ్ ఎఫెక్టెడ్ బెనిఫిట్స్ వొస్తయ్ నేచురల్ కెలామిటీస్ కింద. ఆ ప్రాంతానికి అదనపు నిధులు వొస్తయ్. కాని మన తెలంగాణ నల్లగొండ జిల్లాల...నేనొచ్చి పనిచేసేటప్పుడు...కనగల్ మండలం కురంపల్లి. ఆ కాలువ కింద ఒక చిన్న మడి అంటె రొండుగుంటల మడిపారితే కనగల్ మండలం మొత్తం పారిందని రాసిండ్రు. చివరికి ఆ లిస్టంత తీసి చూస్తే ఒక చిన్న మడిపారింది. కానీ మండలం మొత్తం బ్రహ్మాండంగా పారిందని రాసిండ్రు. అక్కడికి ఇక్కడికి తేడా అది.

జలసాధన సమరం సంపాదకుడు:ఎలికట్టె శంకరరావు

ప్రచురణ:నోముల సాహిత్య సమితి
ధర: రూ. 300
పేజీలు: 428
ప్రతులకు: 9346359268

No comments:

Post a Comment