Tuesday, 6 August 2013

చిరస్మరణీయుడు మన జయశంకర్ సార్


‘‘పుట్టుక నీది
చావు నీది
బతుకంతా దేశానిది’’
కాళోజీ మాటలు ఇటీవలి కాలంలో సరిగ్గా వర్తించేది మన తెలంగాణలో జయశంకర్ సార్‌కే. అవును మరి. మనందరిని ఏకైక స్వప్నానికి చేరువ చేసిన దీర్ఘదర్శి ఆయన. తెలంగాణ సాధన ఆవశ్యకతను మొదట్నుంచీ నినదించిన నిఖార్సయిన తెలంగాణ వాది... రాష్ట్ర విభజన సందర్భంలో తొలుత యాది ఆయన్నే. ఆగష్టు 6న వారి 79వ జయంతి సందర్భంగా ‘బతుకమ్మ’ నీరాజనం. 


ఒక విద్యార్థిగా, టీచర్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా, వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తూనే తెలంగాణ రణన్నినాదాన్ని వినిపించిన పోరాటశీలి ఆయన. ఉద్యోగ విరమణానంతరం పూర్తికాలం తెలంగాణ కార్యకర్తగా పనిచేసి, మనదైన ఒక స్వీయ రాజకీయ అస్తిత్వానికి మనల్ని చేరువ చేశారాయన. రచనలు, ప్రసంగాలు, పరిశోధన- తెలంగాణ సాధనలో క్రియాశీలంగా ఉండే వ్యక్తులతో లోతైన చర్చలు జరపడం- ఇట్లా ఇవ్వాళ్టి కీలక సందర్భానికి భూమికను అందించిన తొలి ఉపాధ్యాయుడు జయశంకర్ సార్.

1934 ఆగష్టు 6న హనుమకొండలో జన్మించిన జయశంకర్ సార్ 1952 నుంచి సాగుతున్న ఉద్యమం మూడు దశలకు సాక్షి. అప్పట్నుంచీ తుదిశ్వాస విడిచేదాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం అన్నదే ఆయన ఏకైక ఎజెండా. తన ‘ఇంవూటస్ట్’ అంతవరకే అని ఆయనే అన్నారు. ఆ ఘడియ చివరి దాకా ఉండి వెళ్లిపోయారు. ఆయన అన్నట్టే తెలంగాణ పునర్నిర్మాణం అన్నదాంతో నిమిత్తం లేకుండా గనుక మాట్లాడుకుంటే, రాష్ట్ర ఏర్పాటు జరిగీ జరగగానే, పొడిచే ప్రతి పొద్దునా, ఆయనే ప్రాతఃస్మరణీయుడు.

ఒక విద్యార్థిగా 1952లో నాన్‌ముల్కీ ఉద్యమంలోకి ఉరికిండు. 54లో ఫజల్ అలీ కమీషన్‌ను కలిసిండు. 1968-71 ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిండు. 1996 నుంచి మళ్లీ మలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నడు.
నిజానికి తెలంగాణ అనేక రకాల ప్రయోగశాల. ఇక్కడ జరగని ఉద్యమం లేదు. కానీ, తెలంగాణ ఒక తేల్చవలసిన అంశంగా మారడానికి కావలసిన భావజాల వ్యాప్తిలో ముందుండి, మరెందరికో స్ఫూర్తినిచ్చింది జయశంకర్ సారే. ఒక వ్యక్తిగా మనసా వాచా కర్మణా తెలంగాణే సర్వస్వంగా జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ ఉద్యమమే ప్రధాన ఇరుసుగా అన్ని శక్తులూ కదిలేలా వ్యవహరించిన ఛోదక శక్తి జయశంకర్ సార్.

నిజానికి విప్లవోద్యమం వల్ల సామాజిక అవగాహన పెంచుకుని, చైతన్యవంతమైన వాళ్లలో జయశంకర్ సార్ కూడా ఒకరు. అయితే, తక్షణ లక్ష్యం అయిన, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ‘భౌగోళిక తెలంగాణ’ సాధనకు పరిమితులతో కూడిన కార్యాచరణ అవసరం అని గ్రహించిన వాళ్లలో ఆయనే ముఖ్యులు. పార్లమెంటరీ, ఉదారవాద రాజకీయాలు కూడా తెలంగాణ సాధనలో కీలకమని గుర్తించి, ఆ దిశగా ఎవరేమన్నా పట్టించుకోకుండా సానుకూల రాజకీయ ప్రక్రియ ఆవశ్యకతను గుర్తించి పనిచేశారు. ‘గమ్యాన్ని ముద్దాడేదాకా ఉద్యమాన్ని వీడేది లేదని కేసీఆర్ వంటివారు ఆత్మస్థయిర్యంతో చెప్పడానికి కావలసిన ప్రాతిపదికను సైద్ధాంతికంగా సమకూర్చింది ఆయనే.

‘‘అయితే నేను సిద్ధాంతకర్తని కాను. అలా అనుకోను. ఇంగ్లీషులో ‘ఐడియలాగ్’ అనే మాట పత్రికలు వాడేవి. తెలుగు అనువాదంగా పత్రికలూ అలాగే వాడాయి. అట్లా నేను సిద్దాంతవేత్తని అయ్యానుగానీ నేను అలా అనుకోను. చివరకు నన్ను ‘టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త’ను అని కూడా అన్నారు.. అది కూడా కాదు. నేను విశ్వసనీయత ఉన్నంతవరకూ, తెలంగాణ సాధనకు ఎవరు పనిచేసినా వారితో ఉన్నాను. నేను సిద్ధాంతకర్తను కాను, కార్యకర్తను, స్వచ్ఛంద కార్యకర్తను’’. (‘వొడవని ముచ్చట’ నుంచి...)

అదీ ఆయన నిజాయితీ, వినవూమత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఒక నమ్మకస్తుడైన, ప్రజలకు విధేయుడైన కార్యకర్త. అట్లే బతికాడు. అట్లే మనపై చెరగని ముద్ర వేసి పోయాడు. కానీ, ఆయన నాయకత్వ ప్రతిభ అబ్బురపర్చే అంశం. చూస్తుండగానే మొత్తం సమాజాన్నే ఆయన కార్యోన్ముఖులను చేసారు.

ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, తొణకని వ్యక్తిత్వం, ఉద్యమ ఒడిదుడుకులకు లోనైతే భావోద్వేగాలకు లోనుకాని స్థితవూపజ్ఞత, వెరసి జయశంకర్ సార్. ఈ ఉదాత్త వ్యక్తిత్వమే ఆయన్ని తెలంగాణ వాదిగా చివరి వరకూ నిలిపింది.

అయితే, ఈ వ్యక్తిత్వం అన్నది పాదుకొనడం వెనుక చరిత్ర ఉన్నది. అది కొత్తగా చెప్పవలసినది కాదు. ఎంతో వివక్ష, మరెన్నో చేదు అనుభవాలు ఆయన్ని తెలంగాణ వాదిగా మలిచాయి. దానికి తోడు ఆయన వెనుకబడిన కులంలో పుట్టడం, వరంగల్‌లో జన్మించడం, ఆర్థిక శాస్త్రాన్ని చదువుకోవడం, వ్యక్తిగత జీవితం అన్నది లేకుండా అవివాహితుడిగా జీవించడం, బోధనా రంగంలోనే జీవిత కాలం కృషి సల్పడం, విప్లవ రాజకీయాల చైతన్యాన్ని అందిపుచ్చుకోవడం, అదే సమయంలో మన సంస్కృతిని నిలు కాపాడుకోవడం, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్- ఈ మూడు భాషల్లో ప్రవీణులై ఉండి, గొప్పగా కమ్యూనికేట్ చేయగలగడం, సరళ సుబోధకంగా కలం పట్టి రాయగలగడం, వీటన్నిటివల్లా ఆయన ఎంచుకున్న కార్యశీలత వన్నెతేలింది. వెరసి ఆయనకు మరింత వినయం, విధేయతా అబ్బాయి. నేను ‘కార్యకర్తను’ అనేంత గొప్పవాణ్ణి చేశాయి.

తన జీవితంలో ఆయన అనేక ప్రశ్నలు వేశాడు. వేయవలసి వాళ్లకే వేశాడు. గణాంకాలతో సహా జవాబులూ చెప్పాడు. ముఖ్యంగా చంద్రబాబును ప్రశ్నించాడు. ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఆంప...అలాగే తెలంగాణ కూడా ‘టేకాఫ్’ అవుతున్నాయంటే, ‘టేకాఫ్’ అంటే పైకెగరడం కదా...కానీ జరుగుతున్నది అది కాదు, ‘మునుగుతున్నది’...అని గట్టిగానే చెప్పాడు. ‘నేనూ ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. మీ ప్రభుత్వ లెక్కలే ఆ సంగతిని ధృవపరుస్తాయి’ అని మరుసటి రోజే బాబుకు వివరంగా రాశాడు. అలా, తాను ఎవరైతే తెలంగాణను ఒక ‘సమస్య’ అనుకుంటారో వాళ్లకు దాని లోతుపాతులను సులభంగా అర్థమయ్యేలా చెప్పాడు. ‘దగాపడ్డ తెలంగాణ’ గురించి రాయడం మొదపూట్టాడు.

మల్లేపల్లి లక్ష్మయ్య ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్’ పేరిట 1997లో ప్రచురించిన సార్ ప్రసంగ పాఠం మెలమెల్లగా యావత్ తెలంగాణకు ఒక కరదీపికే అయింది. అనతికాలంలో ఒక ఆయుధంగా మారింది. ఈ పుస్తకాన్ని తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్రవాళ్లూ చదివి వాస్తవాలు గ్రహించే సౌలభ్యమూ జరిగింది. అయితే, 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ డిమాండ్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిందనే వాదనను ముందుకు తెచ్చింది. అప్పటికే రెండు మూడు ముద్రణలు పొందిన ఈ పుస్తకాన్ని మళ్లీ ఈ తరుణంలో పునర్ముద్రించారు. అలా, జయశంకర్ సార్ ఉద్యమ పితామహులుగా పేరొందడానికి కారణం కార్యకర్తకు కావలసిన ప్రాతిపదికనే కాదు, కేసీఆర్ వంటి నేతలకు కావలసిన ఆత్మవిశ్వాసాన్నీ ప్రోది చేశారు. అందుకు అవసరమైన పరిశోధన అంతా కూడా గురుతర బాధ్యతగా తలమునకలై నిర్వహించారు. నిజానికి తెలంగాణ ఉద్యమ ‘పునరుద్ధరణ’ అని గనుక మనం మాట్లాడుకుంటే, దానికి ఆదినుంచీ జయశంకర్ సార్ ఉఛ్వాస నిశ్వాసాలుగానే ఉన్నారు.

1996 ఆగస్టు 15న ఆనాటి ప్రధాని దేవేగౌడ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ మూడు రాష్ట్రాల ఏర్పాటును ప్రకటించడం, ఆ ఒక్కమాట తెలంగాణ వాదులను తట్టిలేపడం, దాని ఫలితమే అక్టోబర్ 27న నిజామాబాద్‌లో కొందరు సమావేశం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత నవంబర్ 1న వరంగల్‌లో విద్రోహదినం పేరిట సభ ఏర్పాటు...దానికి ఐదువేల మంది జనం వచ్చారట...అక్కడ్నుంచీ మళ్లీ తెలంగాణ వాదన అన్నది మరింత స్థిరంగా, నిరాటంకంగా మొదలై తెలంగాణ ఉద్యమ పునరుద్ధరణకు అంకురం వేసినట్టే అయింది. అయితే నాటి వరంగల్ సభ జరిగిన మరునాడే చంద్రబాబు, ‘వేర్పాటు వాదాన్ని సహించను. ఉక్కుపాదంతో అణచివేస్తాను’ అంటే, ఆ సభ అనంతరం అనేక సమావేశాలు, సభలు జరిగాయి. ఇలా తాను ఆరంభించిన అగ్నికి చంద్రబాబే అజ్యం అవగా, ఆ వేడిని చల్లారకుండా కొనసాగేలా చేసిన వాళ్లలో జయశంకర్ సార్ కీలకం.

ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, ఉద్యోగంలో చేరడానికి వచ్చినప్పుడు మొదలైన వివక్ష, తర్వాత్తర్వాత పెరిగింది. దాంతో పాటు ఆయనలోనూ తెలంగాణ వాది ఎదిగాడు. అయితే, 1996 తర్వాత జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో పూర్తికాలం నిమగ్నమయ్యారు. 2001 దాకా అనేక వేదికలతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా 1996-97లో తెలంగాణ భావజాల వ్యాప్తి విషయంలో నాన్ పొలిటికల్ గ్రూప్‌గా, అకాడమీషియన్స్‌తో కలిసి చాలా చేశారు. అనేక సమావేశాల్లో ప్రసంగిస్తూ, రచనలు చేస్తూ కీలకంగా ఉన్నారు. 1998-99లో అమెరికాలో కూడా తెలంగాణ యాక్టివిటీ పెరగడంతో అక్కడికీ వెళ్లారు. పది పట్టణాల్లో సమావేశాలు పెట్టారు. ఆయన స్ఫూర్తి ‘తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఏర్పాటుకూ మార్గం వేసింది. తర్వాత 2000 సంవత్సరంలో కాంగ్రెస్ వాళ్లు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసుకుంటే ఆయన్ను ఎమ్మెల్యేలు వాళ్ల తరఫున పిలిపించుకుని తెలంగాణ వాదన వినిపించేలా చేసుకున్నరు. రెండున్నర గంటల సేపు ఆయన అధికారికంగా వాదించారు. తర్వాతే కేసీఆర్ జయశంకర్ సార్‌ను కలిశారు. అలా చెన్నాడ్డి మొదలు కేసీఆర్ దాకా...తనను అడిగిన వాళ్లకు తన వంతు సహకారం అందించారు. అవసరమైన చోటల్లా కార్యకర్తగా కృషి చేశారు.

టీఆర్‌ఎస్ వచ్చేదాకా ఒక బలమైన నిర్మాణంతో కూడిన పార్టీ అన్నది లేదు. అది వచ్చాక ఆయన కృషికి మరింత బలం చేకూరింది. అయితే ఆయన ఎన్నడూ ఏ పార్టీలోనూ చేరలేదు. టీఆర్‌ఎస్‌లోనూ సభ్యుడిగా చేరలేదు. ఎందుకంటే తానే అన్నట్టు తన పర్పస్ తెలంగాణ సాధనే. పదవులూ, హోదాలు, లబ్ధి పొందడమూ కాదు. చివరకు ఆయనపై ‘తెలంగాణ సిద్ధాంతకర్త’ అన్న పేరు నుంచి ‘టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త’ అన్న అపవాదు వచ్చినా తన పని మానలేదు. ‘కొందరు అన్నరు, నువ్వు టీఆర్‌ఎస్ లోపల్నుంచి బయటకు రావాలె’ అని! ‘నేను ఎప్పుడు లోపలున్న’ అని నవ్వుతారాయన.

అయితే, ఆయన తాను నమ్మింది ఆచరించాడు. తప్పులు చేస్తున్నావని ఎవరైనా అంటే, ‘మీరు అది కూడా చేయడం లేదు కదా’ అని నోరు మూయించారు. అంతేకాదు, ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు, తనను విమర్శించే వాళ్లను కూడా తాను పల్లెత్తు మాట అనలేదని! ‘‘ఎందుకు విమర్శ చేయనంటే...వాటీజ్ ది పర్పస్? ఎవరికి దోచింది వాళ్లు జేస్తరు. కాలం నిర్ణయిస్తంది. ఎవరి పాత్ర ఏంది అన్నది కాలం నిర్ణయిస్తది.’’ ముందే చెప్పినట్టు, తెలంగాణ సాకారం అయిందీ అంటే అదే ఆ ‘కాలం.’ తెలంగాణ సాకారం కావడమే సిసలైన కాల పరీక్ష. అది సాధ్యమైందీ అంటే జయశంకర్ సార్ పూర్తిగా నెగ్గినట్టే. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్న సమయంలో జయశంకర్ సార్ గురించిన వ్యాసం అందుకే.

ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలంగాణ సాధన అవసరమని. కానీ, పట్టువిడుపులతో ఒక రాజకీయ ప్రక్రియగా తెలంగాణ మారడానికి ఇతోధికంగా కృషి చేసిన వారిలో జయశంకర్ సార్ అద్వితీయులు. అణువణువునా వలసాంధ్ర ఆధిపత్యం అవరించిన వేళ ఆయన బుద్ధిజీవిగా వారి వాదనల్ని ఓడించారు. కానీ, తన శరీరాన్ని కబళించిన క్యాన్సర్ ముందు ఆయన ఓడిపోయారు.  తెలంగాణ సాకారం కాకముందే, 21 జూన్ 2011న ఆయన మనల్ని వీడి వెళ్లిపోయారు. కానీ ఆయన చిరస్మరణీయులు. వారిని తెలంగాణ సమాజం ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే, ఏ పార్టీలోనూ ఆయన సభ్యుడు కాదు. కానీ, తెలంగాణ సభ్య సమాజమే ఒక పార్టీగా భావించి తెలంగాణ సమస్యపై కలసి వచ్చే ప్రతి ఒక్కరితో ఆయన కలిసి పని చేశాడు. ఇది ఆయన వ్యక్తిత్వంలో ఒక ఆశ్చర్యకరమైన అంశం. అదే విషయాన్ని ఆయన మాటల్లో చెబితే, ‘పర్పస్’.

తెలంగాణ మాత్రమే ఆయన ‘పర్పస్’గా ఉండేది. వ్యక్తులు, సంస్థలు, పార్టీలు సెకండరీగా ఉండేవి. ‘‘యాభై ఏళ్లుగా చూశాను. ఒక దగ్గరి దాకా వచ్చి ఆగిపోతున్నాం. కాబట్టి రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ సాధ్యం అని నమ్మాను. కేసీఆర్‌తోనూ అసోసియేట్ అయ్యాను. నిజమే మరి. ఆయన ఉద్యమాన్ని పదేళ్లకు పైగా నిలడకగా ఉంచాడు కదా....ఇది గతంలో ఇంత స్థాయికి తెచ్చింది మరొకరు లేరు. అందుకే, నేను కేసీఆర్ పట్ల బాగా ఇంప్రెస్ అయ్యానని’ ఆయనే చెప్పారు. ఆయన ఇంప్రెషన్ కరెక్టే అయింది. ఒక రాజకీయ శక్తిగా ఇవ్వాళ అందరూ గుమిగూడి కాంగ్రెస్‌ను డిమాండ్ చేసే స్థాయికి వచ్చామంటే ఇలాంటి కార్యశీలత వల్లే. ఆ లెక్కన..మొత్తం సమాజం తన గమ్యాన్ని ముద్దాడేందుకు అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడేదాకా నిశ్శబ్దంగా కృషి చేసిన మేధావి జయశంకర్ సార్. ఆయన్ని రాబోవు తరాలు ‘జాతిపిత’గా గుర్తుపెట్టుకుంటాయా, ‘సిద్ధాంతకర్త’గా కొనియాడుతాయా, పునర్నిర్మాణంలో ఆయన ఆశయాలను పట్టించుకుంటాయా లేదా అన్నది వేరే విషయం. ఇవ్వాళ్టికివ్వాళ తెలంగాణ సాధన సఫలమైతే గనుక ఈ భౌగోళిక తెలంగాణకు ముగ్గువోసిన నిండు మనిషి, వ్యూహకర్తా జయశంకర్ సారే అవుతాడు. ఆ దిశగా ఆయన జరిపిన కృషి, వహించిన గురుతర బాధ్యత, అనుసరించిన జీవన విధానమూ, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవలసే ఉంది.
అన్నట్టు, తెలంగాణ ఉద్యమంలో కళా రూపాల డైమన్షన్‌ను అర్థం చేసుకున్న కొద్దిమందిలో జయశంకర్ సార్ ఒకరు. ‘తెలంగాణ ఉద్యమం మలిదశలో వచ్చినటువంటి కొత్త పార్శం ఏమిటంటే ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం. తాను ఒక కార్యకర్తగా యాభై ఏళ్లుగా చేసింది, ఇప్పుడు కవులు, కళాకారులు, రచయితలు చేస్తుండటం ఆయనకు సంతోషాన్ని కలిగించింది. మలిదశలో వచ్చిన ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణం మన భాషను, యాసను, నుడికారాన్ని, కట్టును, బొట్టును చిన్న బుచ్చటమే అని., ఒక గొంతుక అనేక గొంతులుగా మారడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిండు.

వై.ఎస్. మరణించినప్పుడు ఆయన నిర్మొహమాటంగా ‘ఒక ప్రధాన అడ్డంకి తొలగిపోయింది’ అని అన్నారు. సార్ స్పీచ్ అనంతరం, అదే వేదికపై ఉన్న ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, ‘ఏ సందర్భంలో ఏం మాట్లాడాలీ అన్నది ఒక సిలబస్‌లా కూడా జయశంకర్ సార్ అందించేవాడని’ అన్నారు. ఇట్లా అనేక కీలక, సున్నితమైన సందర్భాల్లో జయశంకర్ సార్ తెలంగాణ వాణిని వినిపించేవారు. మలితరం కార్యకర్తలు, బుద్ధిజీవులకు స్ఫూర్తినిచ్చారు.
అయితే, ఆయన వ్యక్తిత్వం సన్నిహితంగా చూసిన ఎందర్నో ఆకర్షించింది. ముఖ్యంగా మన యువత ఆయన్ని బాగానే అర్థం చేసుకున్నది. తెలంగాణ జాగృతి కార్యకర్త నవీన్ ఆచారి అంటాడు, ‘‘జయశంకర్ సార్‌లో మూడు పార్శ్వాలు మమ్మల్ని ఎల్లవేళలా ప్రభావితం చేస్తాయి. ఒకటి, ఆయన మన కాలంలో ఒక కీలకమైన అంశానికి సంపూర్ణంగా అంకితమైన తెలంగాణ వాది. రెండు, ఆయన తెలంగాణ సమస్యల్ని అరటిపండు ఒలిచి చెప్పినట్లు విడమర్చి చెప్పే మహోపాధ్యాయుడు. మూడు, వ్యక్తిగతంగా కూడా మచ్చలేని తనం’’

నిజమే. విప్లవ రాజకీయాలను ఎంతగా ప్రేమించే వారైనా శ్రీశ్రీ వ్యక్తిగత జీవితాన్ని అయిష్టపడి ఆయనలోని రాజకీయ కోణాన్ని మాత్రం అభిమానిస్తారు. కానీ, తెలంగాణలో జయశంకర్ సార్‌ది ఏ విధంగానూ మచ్చలేని వ్యక్తిత్వం. అందుకే ఒక నిండు మనిషిగా చెరగని ముద్ర వేసిన జయశంకర్ సార్ తెలంగాణ తత్వానికి నిదర్శనం. యువతకు ఆదర్శనీయం.

చివరి రోజుల్లో ఆయన సంతృప్తిగానే ఉన్నారు. ‘‘ఇప్పుడు కంప్లీట్‌గా సొసైటీ మొత్తం వర్టికల్‌గా డివైడ్ అయ్యున్నది. ప్రజల్లోకి బోయింది. ఈ దశ నాకు నా యాభై, అరవై ఏండ్ల అనుభవంలో కూడా లేకుండె. ఇపుడు చాలా తృప్తికరమైన స్టేజి కొచ్చింది. తిరుగులేని స్టేజి కొచ్చినం. ఇపుడు వెనక్కి బోదు. దీన్ని ఎవరూ ఆపలేరు. దటీజ్ ఎ వెరీ డిజైరస్ స్టేజ్ ఇన్ ది మూమెంట్. ఇపుడు నాకు పని లేకుండా జేసిండ్రు అని జెప్తున్న...’’ అని సంతృప్తితో ఆయన అన్నారు కూడా (వినండి: ఒడవని ముచ్చట...ఆడియో)

చివరగా ఒక్క విషయం. తెలంగాణ ఏర్పాటుతో ‘ట్రెమండస్ ఛేంజెస్ ఉంటయి. ఆర్థిక పునర్నిర్మాణంలో బలహీన వర్గాల పాత్ర పెద్దగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ‘ఏది ఏమైనా తెలంగాణ సెంట్రిక్‌గా డెవలప్‌మెంట్ ఉంటది’ అన్నారాయన. ‘సామాజిక న్యాయం. నా కాన్పెస్ట్ అదే’ .. అని కూడా చెప్పారాయన. అయితే, ‘తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటా? టిఆర్‌ఎస్ గవర్నమెంటా అన్నది నాకు ముఖ్యం గాదు. సరకు అదే గదనయ్యా.. సరకు అదే గదా! ఎట్ల పనిజేస్తరన్నది ముఖ్యం’’ అని చెప్పారు.

దీన్నిబట్టి ఒక విషయం స్పష్టం. ఆయన ఒక భూమిపుత్రుడిగా, నిజ కార్యకర్తగా తెలంగాణ తల్లికి చేయవలసింది చేశారు. ఇక మిగిలింది మన పనే!

No comments:

Post a Comment