Thursday 1 September 2011

కన్న తల్లి... మన పుట్టుక... తన జీవితం

కోవెల వంటి నీ కడుపులో 9 నెలలు నన్ను మోసి 
ప్రాణం పోసిన దేవతవే అమ్మ నీవు
భాదను దిగమింగి నీ పేగు తెంచుకోని 
నాకు జన్మనిచ్చిన ఆదిశక్తి రూపమే నీవమ్మ
సృష్టిలోనే శాశ్వత సత్యమే నీవమ్మ, 
జగమెరిగిన భాషల్లో తొలి పలుకు నీవే అమ్మ 
దండాలమ్మ నీకు పాదాభి వందనాలమ్మ, 
సృష్టికర్తనే సృష్టించిన గొప్ప జన్మ నీదమ్మ 
 
నీ రోమ్మేగా ఉగ్గు పోసి నాకు బతుకునిచ్చింది, 
ఆ పాలేగా నా ఒంట్లో రక్తాన్ని నింపింది 
నీ చిటికెన వేలేగా నాతో జీవన ప్రయాణంలో 
బుడి బుడి నడకలను వేయించింది 
నీ బ్రతుకే నాకో హారతివైన దేవతవమ్మ,  
సెలవు లేని కొలువు కూడా నీదే కదా అమ్మ 
||దండాలమ్మ..|| 
 
మల్లె పూల కన్న తెల్లనైనదే నీ మనసు, 
తేనె కన్న తియ్యనైనదే నువ్వు పాడే జోల పాట
చందమామ కన్న స్వచ్చమైనదే నీ ప్రేమ, 
మంచు కన్న చల్లనైనది నీ ఒడే కదా అమ్మ
సప్తస్వరాల కంటే మధురమైనదే నీ అనురాగం, 
అడగకుండానే వరాలిచ్చే దేవతవమ్మ 
||దండాలమ్మ..|| 
 
నేను ఎంత ఎత్తుకు ఎదిగినా నీకు మాత్రం 
నేను ఇంకా నీ కొంగు చాటు పసికూనంటివి 
నా ముఖం లోని ముసి ముసి నవ్వులే, 
నీకు గంగలలో తేనెలలో కడిగిన ముత్యాలంటివి
నా ఆశలు ఆశయాలే నీ కలల పంట అంటివే, 
నీ త్యాగాన్ని తలచుకొని నా ఆశలకే సిగ్గు వేసెనా
||దండాలమ్మ..|| 
 
తప్పటడుగు వేసినప్పుడు దీవెనల వంటి 
నీ కమ్మనైన దెబ్బలే ఇప్పుడు గుర్తుకొచ్చెనా
నీ చేతి బువ్వ లేక నాకు ముద్దనే దిగదాయే, 
నీ ప్రేమకు దూరమై నా ఆకలే తీరదాయేనా 
కంటి పాప మీద నీ ముద్దుతోనే నాకు పొద్దు పోయేనా, 
అది లేక నిద్రలేని రాత్రులెన్నో
||దండాలమ్మ..|| 
 
శ్రీ రామ రక్ష వంటి నీ తోడునే వదిలొస్తినా
కదిలే దేవతలా నువ్విచ్చే దీవెనలే మతికొచ్చెనా
సల్లంగున్నవా బిడ్డా? ఎట్లున్నావ్ కొడకా? 
పదే పదే నువ్వు అడిగే అమాయకమైన ప్రశ్నలకు కోపగిస్తినా
కలలో అవి గుర్తుకొచ్చి కళ్లెమ్మటి నీళ్ళే వచ్చెనా, 
ఏడిస్తే బుజ్జగించనీకి అమ్మ లేదాయే అని ఏడుపొచ్చెనా
||దండాలమ్మ..|| 

పసి కూనగా పుట్టి.. 
ఆడ బిడ్డగా పెరిగి.. 
ఆగని యంత్రమై.. 
రాజీలేని దాసీ అయి
తన బతుకుకే చితి రగిలించి..
మన కోసం హారతై...
ఇల్లునే గుడి చేసే అమ్మకు..
ఎన్ని శోకాలో..
ఎన్నెన్ని శాపాలో..
ఓ లోకమా ఇది ధర్మమా? బ్రహ్మ నీకిది న్యాయమా?
ఈ కవనం మా అమ్మ కి మరియు ఈ లోకంలో ఉన్న అందరమ్మలకు అంకితం...!!
 
-- Nishanth Dongari
   Marie Curie Research Fellow 

No comments:

Post a Comment