Wednesday, 30 January 2013

జరుగుతున్నదీ జగన్నాటకం -- అనంత జీవిత సత్యం

ఎవరు నీవు? ఏ ధాతు గర్భం నుండి ఎదిగిన మానువు?
ఎన్నెన్ని ప్రస్థానాలు నీకు ? ఎన్నెన్ని పరిభ్రమనాలు నీకు?
అంతలోనే నురగల పరుగులు. ఇంతలోనే కదలని అడుగు.
ఎవరు నీవు? ఏ ధాతు గర్భం నుండి ఎదిగిన మానువు?

ఎలా కుదించుకున్నావు ఇంత మొలకలో అంతటి శాఖలు?
ఎలా పొదుగుకున్నావు ఇంత విత్తులో అంతటి జీవరేఖలు?
తరువులా పెరిగిన నీవు
తిరిగి చుసుకుంటున్నావు నిన్ను నీవు

ముసురుకోస్తున్నాయి హరిత స్మృతులు
మొక్క పొత్తిళ్ళ నుంచి కొమ్మల పందిళ్ళ దాకా
అమ్మ ఒడినే అనంత విశ్వమనుకుని
స్తన్యం లోనే సమస్త మధురిమలందుకొని
బాల్యాన్ని కుల్యలీదిన నీవు పలవరించావు నీలోనీవు మెరిసి.

అగుపించిన సొగసులన్నీ మగువగా మలచుకొని
అల్లుకున్న స్వప్నాలన్నీ ఆకృతులుగా నిలుపుకొని
తాకిన పూల రేకులన్నీ తరుణి పెదవులనుకుని
సోకిన గాలితరగలన్నీ సురభిల శ్వాసలనుకుని
తరలిపోయే కాలాన్ని పరిష్వంగంలో పొదుగుకుని
పరవశించిన ప్రతిక్షణాన్ని సురానుభుతిగా దాచుకొని
యవ్వన గగనాలంటిన నీవు నవ్వుకున్నావు నీలోనీవు ఎగిసి.

కట్టుకున్న వెన్నెలగూటిలో కాపురం పెట్టి
పెంచుకున్న మమకారాల అంచులు ముట్టి
ఆశించిన సంపదల అందలాలపై ఊరేగి
కోరుకున్న అనుభవాలాను సురాపానంలా తాగి
గీసిన గీటు చెల్లుతా ఉంటె మీసాలపై చేయిసాగి
వేసిన పాచిక పారుతూ ఉంటె వెండి జుట్టు మెత్తగా ఊగి
ముదిమిని తొడుక్కున్న నీవు ముచ్చటించుకున్నావు నీలోనీవు తరచి.

కానీ ఎందాక నీ ఈ నడక ? నీ అడుగు సాగిందాక.......
ఎన్నాళ్ళు సాగుతుంది అడుగు? ఎదురుగా లోయలో పడిపోయేదాక.....
ఏమంటుంది ఆ లోయ? ఈడ్చుతుంది నిన్ను అగాధందాక...
ఏమౌతుంది ఆ పైన ? ఇది నీకు ప్రశ్నగా మిగిలే ప్రశ్న, ఒక శేష ప్రశ్న !!

ఆ ప్రశ్నలతో బుర్రలో బద్దలవుతున్న తేళ్ళపొట్టలు.
వెర్రిగా కొట్టుకుంటున్న గుండె, వేళ్ళలో ఇరుక్కున్న జుట్టు
కాళ్ళను లాగుతున్న ఊబి, తలను చీల్చేసే అరుపు అలలు అలలుగా
అలల నురగలమీద అచ్చవుతున్న అక్షరాలు
అవ్యక్తాన్ని ప్రశ్నిస్తున్న ఆక్రుతుల్లాగా...
నీ దృష్టికందని సృష్టి ఉందేమో? సృష్టికందని నీ దృష్టి ఉందేమో?
నీ వాక్కుకందని అర్ధం ఉందేమో? నీ మనసుకందని భావం ఉందేమో?
నిన్ను ఆవరించె శక్తి ఉందేమో? శూన్యాన్ని చిత్రించే చైతన్యం ఉందేమో?
ఉన్నట్టే ఉంది -- ఊగింది నీ శిరసు పరవశించి
ఉన్నట్టే ఉంది -- మోగింది నీ శరీరం పరిస్పందించి.

"అక్కడే మొదలవుతుంది నీలోని మానవ సంస్కృతి"
నీవిప్పుడు గాలిబుడగ కాదు, ఏ దారం చేతిలోనో ఎగిరే తోలు పడగ కాదు.
నీవే ఒక చైతన్య వారిధి, నీవే దానికి కట్టిన వారధి.
నీ జ్ఞానం సృష్టి సమస్య పూరనమ్, నీ ధాన్యం మూల రహస్య ప్రేరణం
నీ కన్ను పలికితేనే ఉదయం, నీ మనసు మలిగితేనే అస్తమయం.

ఇలా ఋషితత్వానికి పశుతత్వానికి
సంస్కృతికి దుష్కృతికీ
స్వచ్చందతకూ నిర్బంధతకూ
సమార్ధ్రతకూ రౌద్రతకూ
తొలిబీజం నీ మనసు, తులా రూపం నీ మనసు.
ఆ మనసుకు తొడుగే నీవు
నీకు ఉడుపే ఈ జగతి.

కలికితీపి
కలిమితీపి
కడుపుతీపి
కలిసి ఆడే నిరంతర నాటకంలో నీవు వేసే నాయక పాత్రకు
కడకు మిగిలేవి సుడిగుండాలే.
అలాంటి గుండెలోని సుడిగుండాలను
నిండు నవ్వులుగా మనసులో మలిచినప్పుడే
మనిషిగా నీవు పురోగామిస్తావు
ఇదే విశ్వంభరాతత్వం
ఇదే అనంత జీవిత సత్యం...!!

No comments:

Post a Comment